Protest Against Chandrababu : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై నెల రోజులపైనే దాటి పోయింది. నాటి నుంచి నేటి వరకు.. గల్లీ నుంచి దిల్లీ వరకూ చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ విశ్రమించకుండా నిరసనలు, ఆందోళనలు కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు.తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఉద్రిక్తత పరిస్థితులు మిన్నంటుతున్నాయి.
ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం (Chandrababu Health) సరిగా ఉండక పోవడంతో.. రాష్ట్రంలో నిరసనల హోరు తారాస్థాయికి చేరుకున్నాయి. చంద్రబాబు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో చంద్రబాబు తొందరగా విడుదల కావాలంటూ వినూత్న పద్ధతిలో నిరసన తెలుపుతున్నారు.
Poodota Sunil Protest : తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడు పూదోట సునీల్ చంద్రబాబు కోసం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రులోని బాలయేసు ఆలయంలో దివ్యాంగులు మోకాళ్లపై నడిచి.. చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలంటూ ప్రార్థనలు చేశారు. ప్రధాన రహదారి నుంచి ఆలయం పైకి మోకాళ్లపై నడిచి చంద్రబాబు కోసం దేవుడ్ని మొక్కుకున్నారు.
